Vijay Sai Reddy: అభ్యర్థులు లేని చోటల్లా జనసేనకు వదిలేశామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారట: విజయసాయిరెడ్డి
- పొత్తులకు కూడా కొన్ని సైద్ధాంతిక విలువలు, నియమాలుంటాయి
- బీజేపీతో అంటకాగుతున్న జనసేనతో తెలుగుదేశం సీట్ల సర్దుబాటు
- జనం నవ్వుకుంటున్నారు
- ఒక్క మండలమైనా కచ్చితంగా గెలుస్తామని చెప్పండి చూద్దాం
స్థానిక ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలతో టీడీపీ పొత్తులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విలువలు లేకుండా టీడీపీ ప్రవర్తిస్తోందని ట్వీట్ చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా టీడీపీకి లేదని అభిప్రాయపడ్డారు.
'పొత్తులకు కూడా కొన్ని సైద్ధాంతిక విలువలు, నియమాలుంటాయి. బీజేపీతో అంటకాగుతున్న జనసేనతో తెలుగుదేశం సీట్ల సర్దుబాటు చేసుకుంటుంటే జనం నవ్వుకుంటున్నారు. అభ్యర్థులు లేని చోటల్లా జనసేనకు వదిలేశామని చెప్పుకుంటున్నారట. ఒక్క మండలమైనా కచ్చితంగా గెలుస్తామని చెప్పండి చూద్దాం' అని విమర్శించారు.
'ఎలక్షన్లలో అక్రమాలు, అరాచకాల గురించి చంద్రబాబు సుద్దులు చెబుతున్నాడు. ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించిన చరిత్ర నీది కాదా? మా పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను బెదిరించి జెడ్పీలను, ఎమ్మెల్సీ పదవులను లాక్కుంది ఎవరు? గెలిచే పరిస్థితి కనిపించకపోవడంతో ఇప్పుడు బురద చల్లుతున్నావు' అని విమర్శించారు.
'ఎంతకైనా దిగజారతాడు చంద్రబాబు. పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు కులాలు అంటగడతాడు. అధికార పార్టీ సానుభూతిపరులని ముద్ర వేస్తాడు. ఎల్లో మీడియా కమ్మగా సన్నాయి మోగిస్తుంది. ప్రజలు నమ్ముతున్నారని భ్రమ పడతాడు. ఆఖరున నేనెందుకు ఓడానో అర్థం కావడం లేదని శోకాలు పెడతాడు' అని ట్వీట్లు చేశారు.