Rahul Gandhi: ఇలాగైతే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుంది.. మోదీపై రాహుల్ ఫైర్
- కరోనా వైరస్ చాలా పెద్ద సమస్య
- పట్టించుకోకుండా ఉండటమే పరిష్కారం కాదు
- ఇంత జరుగుతున్నా కేంద్రం ఏదో మైకంలో ఉండిపోయిందని వ్యాఖ్య
కరోనా వైరస్ పట్ల మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పటికైనా గట్టి చర్యలేవీ తీసుకోకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉంటే ప్రభుత్వం ఏదో మైకంలో ఉండిపోయిందని విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్టర్ లో పలు ట్వీట్లు చేశారు.
ఇది అతి పెద్ద సమస్య
కరోనా వైరస్ ప్రభావం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం, ఆర్థిక మందగమనంపై రాహుల్ గాంధీ వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై మోదీ తీరును తప్పుపడుతూ గురువారం పలు ట్వీట్లు చేశారు. దేశాన్ని నడిపించాల్సిన మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఎలాగని విమర్శలు గుప్పించారు. తాజాగా శుక్రవారం మరోసారి ఈ విషయాన్ని ఎత్తి చూపారు.‘‘ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతాను. కరోనా వైరస్ చాలా పెద్ద సమస్య. దీనిని పట్టించుకోకుండా ఉండటం దానికి పరిష్కారం కాదు. ఇప్పటికైనా గట్టి చర్యలేవీ తీసుకోకుంటే భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏదో మైకంలో ఉండిపోయింది..” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.