BCCI: ఒకే వేదికపై భారత్, దక్షిణాఫ్రికా చివరి రెండు వన్డేలు?
- రెండు మ్యాచ్‌లకు ప్రేక్షకులకు అనుమతి లేదు
- ఇప్పటికే లక్నో చేరుకున్న ఆటగాళ్లు
- లక్నోలోనే రెండు మ్యాచ్‌లు జరపాలని భావిస్తున్న బోర్డు
కరోనా వైరస్ దెబ్బకు ఐపీఎల్‌ను వాయిదా వేసిన బీసీసీఐ ఇప్పుడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరి రెండు వన్డేలను ఒకే వేదికపై నిర్వహించాలని భావిస్తోంది. కేంద్ర క్రీడా శాఖ సూచనల మేరకు ఈ రెండు మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకూడదని బోర్డు ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఖాళీ స్టాండ్లలో జరిగే మ్యాచ్‌లను ఒకే వేదికపై నిర్వహిస్తే సరిపోతుందని బోర్డు ఆలోచిస్తోంది. రెండో వన్డే జరిగే లక్నోలోనే మూడో మ్యాచ్ కూడా నిర్వహించే విషయంపై బోర్డు ఆఫీస్ బేరర్లు దీని కోసం కసరత్తులు చేస్తున్నారు.
గురువారం ధర్మశాలలో జరగాల్సిన తొలి వన్డే వర్షం వల్ల టాస్ పడకుండానే రద్దయింది. ఇరు జట్ల ఆటగాళ్లు అక్కడి నుంచి రెండో మ్యాచ్ కోసం లక్నో చేరుకున్నారు. ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది. చివరి వన్డేను ఈ నెల 18న కోల్‌కతాలో షెడ్యూల్ చేశారు.
‘మ్యాచ్‌లు కేవలం టీవీల్లో ప్రసారం అవుతాయి. అలాంటప్పుడు క్రికెటర్లు మరో వేదికకు వెళ్లి ఆడాల్సిన అవసరం ఏముంది? లక్నోలోనే మూడో మ్యాచ్ నిర్వహిస్తే ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది, మ్యాచ్ అధికారులు, ప్రసార సిబ్బంది తదితరులు కోల్‌కతాకు ప్రయాణం చేయాల్సిన పని ఉండదు. ఇది ఆచరణాత్మక విషయమే. బీసీసీఐ దీని గురించి పరిశీలిస్తోంది. ఏం జరుగుతో చూడాలి’ అని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.