Nadendla Manohar: ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కూడా మాతో పొత్తుకు ప్రయత్నించింది!: నాదెండ్ల మనోహర్
- అసెంబ్లీ ఎన్నికల్లో చాలా పార్టీలు మా వద్దకు వచ్చాయి
- కానీ, ఓ నిర్ణయం తీసుకున్నాం
- ఒక తరానికి ఉపయోగపడేలా రాజకీయాలు చేయాలి
- అంతే తప్పా ఒక ఎన్నికల కోసం రాజకీయాలు చేయకూడదు
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఆ పార్టీ ముఖ్యనేతలందరూ సమావేశమై ప్రసంగిస్తున్నారు. ఇందులో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు. 'గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడానికి కారణాలున్నాయి. ఈ విషయాన్ని మూడు నెలల నుంచి బహిరంగంగానే మాట్లాడుతున్నాం' అని చెప్పారు.
'చాలా పార్టీలు వచ్చి మాతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేశాయి. ఈ రోజు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కూడా ప్రయత్నించింది. కానీ, ఆ రోజు మేం ఓ నిర్ణయం తీసుకున్నాం. కచ్చితంగా యువత కోసం, ఒక తరానికి ఉపయోగపడేలా రాజకీయాలు చేయాలి తప్పా ఒక ఎన్నికల కోసం రాజకీయాలు చేయకూడదని కల్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు' అని నాదెండ్ల తెలిపారు.
'ప్రత్యేకంగా కొందరు యువకులను ఎంపిక చేసి పోటీ చేయించారు. అటువంటి రాజకీయాలు చేస్తున్నాం. వేరే పార్టీల్లో ఏముంది చెప్పండి? మొదట 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమని అభ్యర్థులకు చెబుతున్నారు. అటువంటి వారు సమాజానికి ఉపయోగపడతారా?' అని ప్రశ్నించారు.
'ఏపీకి విభజన తర్వాత జరుగుతోన్న అన్యాయంపై పోరాడే వారు ఎక్కడున్నారు ఈ రాజకీయాల్లో? ఎక్కువ ప్రాధాన్యత యువతకే ఇద్దామని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతారు. స్వార్థ రాజకీయాలు చేయొద్దనే సిద్ధాంతంలో ముందుకు వెళ్తున్నాం' అని చెప్పారు.