Corona Virus: ఎవ్వరికీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి ఇంటికి చెక్కేసిన నలుగురు కరోనా అనుమానితులు!
- నాగ్‌పూర్ ప్రభుత్వ అసుపత్రిలో ఘటన
- కరోనా పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడంతో ఆందోళన
- తిరిగి ఆసుపత్రిలో చేరాలని చెప్పిన పోలీసులు
కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన నలుగురు వ్యక్తులు వైద్యులకు చెప్పకుండానే ఇంటికి వెళ్లిపోవడం కలకలం సృష్టించింది. మహారాష్ట్ర, నాగ్ పూర్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. కరోనా అనుమానంతో ఇద్దరు పురుషులు, మరో ఇద్దరు మహిళలు ఇందిరా గాంధీ ప్రభుత్వ మెడికల్ కళాశాల, అసుపత్రిలో చేరారు. వాళ్లందరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఫలితాలు ఇంకా రాలేదు. కానీ, ఆ నలుగురూ ఎవ్వరికీ చెప్పకుండా శుక్రవారం రాత్రి ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు.
దాంతో, ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు వాళ్ల అడ్రస్ గుర్తించారు. తిరిగి ఆసుపత్రిలో చేరాలని వాళ్లకు చెప్పినట్టు తెలిపారు. అయితే, తమ పరీక్ష ఫలితాలు ఆలస్యం కావడంతో పాటు అదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కరోనా బాధితులకు కేటాయించిన టాయిలెట్లను ఉపయోగించాలని చెప్పడంతో భయపడే వెళ్లిపోయామని ఆ నలుగురు తమకు చెప్పారని పోలీసులు తెలిపారు. కాగా, నాగ్‌పూర్‌లో ఇప్పటిదాకా 19 మంది కరోనా అనుమానితులను గుర్తించగా.. అందులో ముగ్గురికి వైరస్ నిర్ధారణ అయింది.