Corona Virus: కరోనా వైరస్‌పై వదంతులు ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష: హెచ్చరించిన కమిషనర్ అంజనీకుమార్
- వైరస్‌పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు
- జాతీయ విపత్తు నిర్వహణ మండలి చట్టం ప్రకారం శిక్ష
- సమాజానికి చెడు చేయొద్దు
కరోనా వైరస్‌పై వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. వైరస్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేసినా, వదంతులు వ్యాపింపజేసినా చర్యలు తప్పవన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ మండలి చట్టం 5.1 ప్రకారం అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వైరస్‌పై దుష్ప్రచారం చేస్తూ పట్టుబడితే ఏడాది వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. వదంతులు ప్రచారం చేయడమంటే సమాజానికి చెడు చేయడమేనని, వీటి వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉందని అంజనీకుమార్ అన్నారు. కాబట్టి కరోనా వైరస్ వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
కాగా, దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31 వరకు స్కూళ్లు, సినిమా హాళ్లు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ విషయంలో ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని, పరిశుభ్రత పాటించడం ద్వారా దానికి దూరంగా ఉండొచ్చని ప్రభుత్వం సూచించింది.