Anantapur District: అధికార వైసీపీ ఎన్నికల దారుణాలు మితిమీరుతున్నాయి : సీపీఐ రామకృష్ణ
- మాజీ మంత్రి కాల్వ అరెస్టు దారుణం
- దాడి చేసిన వారిని వదిలేసి ఆయన పై చర్యలా
- తక్షణం కాపురామచంద్రారెడ్డిని అరెస్టు చేయాలి
రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అక్రమాలు మితిమీరుతున్నాయని, ఇందుకు రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఘటనలే ఉదాహరణ అని సీపీఐ నేత రామకృష్ణ ఖండించారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపై దాడి చేసిన వారిని వదిలేసి ఆయన పైనే చర్యలు తీసుకోవడం అధికార దుర్వినియోగమేనని మండిపడ్డారు. ఈ విషయంలో ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి పూర్తి బాధ్యుడని, అతని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల్లో వేర్వేరు కారణాలతో ఇద్దరి నామినేషన్లు తిరస్కరించిన నేపధ్యంలో దానిపై చర్చించేందుకు మాజీ మం త్రి కాల్వ శ్రీనివాసులు మున్సిపల్ చాంబర్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి కూడా రావడంతో వివాదం నెలకొంది.
ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు కాల్వ పై దాడికి తెగబడినా ఎమ్మెల్యే ఆపే ప్రయత్నం చేయలేదన్నది ఆరోపణ. పోలీసులు అతి కష్టమ్మీద కాల్వను ఊరి పొలిమేరల వరకు తీసుకువెళ్లి పంపించేశారు. ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ ఘటన జరిగినందున అతన్ని అరెస్టు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అలాకాకుండా కాల్వ శ్రీనివాసులను అరెస్టు చేయడం దారుణమన్నారు.