Vijay Sai Reddy: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కంటే ప్రమాదకారి ఎవరైనా ఉన్నారంటే అది నిమ్మగడ్డ రమేశ్ కుమార్: విజయసాయిరెడ్డి

YSRCP MP Vijayasai Reddya strongly condemns SEC decision
  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
  • కనకపు సింహాసనం మీద శునకం తీరులో వ్యవహరించారంటూ వ్యాఖ్యలు
ఏపీలో స్థానిక సంస్థలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై సీఎం జగన్, ఇతర వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అత్యంత తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కంటే ప్రమాదకారి ఎవరైనా ఉన్నారా అంటే అది నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రమేనని అభివర్ణించారు. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెడితే ఏం చేసిందో ఎన్నికల కమిషనర్ గా రమేశ్ కుమార్ తీరు కూడా అదే విధంగా ఉందని విమర్శించారు. ఎవరైనా వ్యక్తికి అనారోగ్యం వస్తే చికిత్స చేయవచ్చేమో కానీ, ఓ వ్యక్తికి మెదడంతా పాడైపోతే అతడిని భగవంతుడు కూడా కాపాడలేడని అన్నారు.

"నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్నది తీవ్ర నిర్ణయం. కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో కరోనా బాధితుడు ఒక్కరే. అది కూడా ఇతర దేశం నుంచి వచ్చారు. కానీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మాత్రం ఇదో విపత్తులా అనిపించింది. ఆయన నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని కానీ, సీఎస్ ను కానీ సంప్రదించలేదు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయానికి ముందు రాజకీయ పార్టీలను సంప్రదించామంటున్నారు... వైసీపీ రాజకీయ పార్టీ కాదా? ఒక్క తెలుగుదేశం పార్టీనే రాజకీయ పక్షమా? ఒక్క చంద్రబాబునాయుడ్ని మాత్రమే సంప్రదించి, అన్ని పార్టీలను సంప్రదించామంటే సరిపోతుందా?

రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఏ అధికారి అయినా దేశం కోసం పనిచేస్తారు. కానీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం చంద్రబాబు కోసమే పనిచేస్తారు. ఒక కులపిచ్చి ఉన్న వ్యక్తిలా వ్యవహరించి నిర్ణయం తీసుకున్నారు. రమేశ్ కుమార్ కు సిగ్గుంటే పదవికి రాజీనామా చేయాలి. తాను తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని నిరూపించుకోవాలి. 'నిమ్మగడ్డ రమేశ్ కుమార్' అనే బదులు 'నారావారి గబ్బిలం' అని పిలిస్తే బాగుంటుంది. ఎన్నికల కమిషనర్ పదవిపై మాకు గౌరవం ఉంది కానీ, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వంటి వ్యక్తిని మాత్రం ఎప్పటికీ గౌరవించలేం.

 తన నిర్ణయం నేపథ్యంలో ఆర్టికల్ 243కె, ఆర్టికల్ 243జడ్ఏ లను ఉపయోగించాడు. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు కానీ, మానవ కల్పిత విపత్తు వచ్చినప్పుడు కానీ ఈ ఆర్టికల్ ఉపయోగించి ఎన్నికలు వాయిదా వేయొచ్చు. కానీ, కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో ఒకే ఒక్క వ్యక్తికి కరోనా వస్తే ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికల కమిషనర్ గా రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఓ శాడిస్టు నిర్ణయంగా భావిస్తున్నాం. మునిగిపోతున్న టీడీపీ నావను రక్షించడానికే రమేశ్ కుమార్ ఎన్నికలు వాయిదా వేశారు" అంటూ నిప్పులు చెరిగారు.
Vijay Sai Reddy
Nimmagadda Ramesh
Local Body Polls
Postpone
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News