Donald Trump: 'చైనీస్ వైరస్' అంటూ కరోనాపై ట్రంప్ ట్వీట్.. మండిపడ్డ చైనా
- 'చైనీస్ వైరస్' ప్రభావం వల్ల నష్టపోతోన్న పరిశ్రమలంటూ ట్రంప్ ట్వీట్
- ఆ పరిశ్రమలకు అమెరికా పూర్తిగా సహకారం అందిస్తుందని వ్యాఖ్య
- నిందించడం మానేసి వైరస్‌ను కట్టడి చేయాలన్న చైనా
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను 'చైనీస్ వైరస్' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసి చైనా ఆగ్రహానికి గురయ్యారు. 'చైనీస్ వైరస్' ప్రభావం వల్ల నష్టపోతోన్న ఎయిర్‌లైన్స్ వంటి పరిశ్రమలకు అమెరికా పూర్తిగా సహకారం అందిస్తుందని, తిరిగి గతంలో ఎన్నడూ లేనంత బలంగా తాము తయారవుతామని అన్నారు.
ట్రంప్ ట్వీట్‌పై చైనా సీనియర్ అధికారి యంగ్ జేచీ స్పందిస్తూ... కరోనా నియంత్రణకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే, ట్రంప్ కామెంట్లు సరైన రీతిలో లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాను నిందించడం మానేయాలని, వైరస్ నియంత్రణకు పనిచేయాలని చెప్పుకొచ్చారు. కాగా, అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మూడు వేల మందికి పైగా కరోనా సోకింది.