Madhya Pradesh: బల పరీక్షపై 24 గంటల్లో సమాధానం ఇవ్వండి.. కమల్ నాథ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
- మాజీ సీఎం శివరాజ్ సింగ్ పిటిషన్పై అత్యవసర విచారణ
- తమపై ఎవరూ ఒత్తిడి తేలేదంటూ రాజీనామా చేసిన ఎమ్మెల్యేల వివరణ
- కాంగ్రెస్ సర్కారుకు మరిన్ని చిక్కులు
మధ్యప్రదేశ్లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. అసెంబ్లీలో బల పరీక్ష అంశంపై కమల్ నాథ్ సర్కారుకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. 24 గంట్లలో దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అసెంబ్లీలో తక్షణం బల పరీక్ష నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించిన జస్టిన్ డీవై చంద్రచూడ్, హేమంత్ గుప్తాతో కూడిన ధర్మాసనం దీనిపై బుధవారం 10.30 నిమిషాల లోపు సమాధానం చెప్పాలని కమల్ నాథ్ సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
మరోవైపు కమల్ నాథ్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా తమపై ఎవ్వరూ ఒత్తిడి తేవడంలేదని శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుపీంకోర్టుకు తెలియజేశారు. దాంతో, కాంగ్రెస్ సర్కారుకు మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టుకు ఎలాంటి సమాధానం ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.