Bandi Sanjay: కేసీఆర్, ఒవైసీలు ‘పాక్’ కు శరణార్థులుగా వెళ్లాల్సిందే: బండి సంజయ్
- ఎన్పీఆర్ లో కేసీఆర్, ఒవైసీలు తమ పేర్లు నమోదు చేసుకోవాలి
- అలా చేయకపోతే వాళ్లిద్దరికీ ఓట్లు లేనట్టే
- ముస్లింల ఓట్ల కోసమే సీఏఏ పై వ్యతిరేక తీర్మానం చేశారు
సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జాతీయ జనాభా రిజిష్టర్ (ఎన్పీఆర్) లో పేర్లు నమోదు చేసుకోకుంటే కేసీఆర్, ఒవైసీలు పాకిస్థాన్ కు శరణార్థులుగా వెళ్లాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్పీఆర్ లో కనుక వారి పేర్లు నమోదు చేసుకోకుంటే కేసీఆర్, ఒవైసీకి ఓట్లు లేనట్టేనని హెచ్చరించారు.
తెలంగాణ అసెంబ్లీలో సీఏఏపై వ్యతిరేక తీర్మానం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ తీర్మానం చెత్తబుట్టకే పరిమితమవుతుందని అన్నారు. కేసీఆర్ తీరుతో తెలంగాణ తలదించుకునే పరిస్థితి వచ్చిందని, ముస్లింల ఓట్ల కోసమే ఈ తీర్మానం చేశారని ధ్వజమెత్తారు. సీఏఏతో దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని మరోమారు స్పష్టం చేశారు. ముస్లింలు వేరే దేశం నుంచి మన దేశానికి వస్తే కనుక ఇక్కడి ముస్లింల పొట్టకొట్టే ప్రయత్నం చేసినట్టే అవుతుందని, వాస్తవాలు తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.