Nimmala Rama Naidu: రాష్ట్ర ప్రజల ప్రాణాలను ఎన్నికల కమిషనరే కాపాడారు: రామానాయుడు
- విదేశాల నుంచి వేలమంది రాష్ట్రానికి వచ్చారన్న నిమ్మల
- వారందరి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అంటూ ప్రశ్న
- స్థానిక సంస్థల ఎన్నికలు రీషెడ్యూల్ చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలను కాపాడారని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అని ప్రశ్నించారు. రెండు వారాల్లో 10 వేల మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారని తెలిపారు.
స్థానిక ఎన్నికలను రీషెడ్యూల్ చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2014లో ఒక్క జడ్పీటీసీ మాత్రమే ఏకగ్రీవమైందని, ఇప్పుడు 126 జడ్పీటీసీలు, 2406 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. కడప, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 1786 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని, ఈ 5 జిల్లాల్లో 80 శాతం ఏకగ్రీవం అవడానికి కారణమేంటి అని ప్రశ్నించారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుపై హత్యాయత్నం చేశారని, మాజీమంత్రికే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని అన్నారు.