Etela Rajender: తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తికీ ‘కరోనా’ సోకలేదు: మంత్రి ఈటల
- ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్లకే ‘కరోనా’ పాజిటివ్
- ఆ వ్యక్తుల నుంచి మరెవరికీ ఈ వైరస్ సోకలేదు
- ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా వైద్య సిబ్బంది శ్రమిస్తోంది
ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికీ కరోనా వైరస్ సోకలేదని తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోమారు స్పష్టం చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇతర దేశాలు దుబాయ్, ఇటలీ, స్కాట్లాండ్, నెదర్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చిన ఐదుగురు వ్యక్తులకే ‘కరోనా’ పాజిటివ్ గా ఉందని అన్నారు.
ఇక ‘కరోనా’ పాజిటివ్ గా ఉన్న వ్యక్తుల నుంచి మరెవరికీ ఈ వైరస్ సోకలేదని, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చే వారికి ‘కరోనా’ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణలో మొత్తం కరోనా టెస్ట్ ల్యాబ్ లు ఆరింటిలో పరీక్షలు నిర్వహిస్తున్నారని, వరంగల్ లో ఈ ల్యాబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని చెప్పారు. ‘కరోనా’ లక్షణాలు వున్న వారిని క్వారంటైన్ లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ‘కరోనా’ కేసులకు సంబంధించిన సమాచారాన్ని బులెటిన్ల ద్వారా విడుదల చేస్తామని చెప్పారు. ‘కరోనా’పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.