coronavirus isolation ward menu: గుడ్లు, పండ్లు, చేపలు ఫ్రై.. కరోనా ఐసోలేషన్ వార్డు మెనూ ఇదిగో
- విడుదల చేసిన కేరళ ప్రభుత్వం
- భారతీయులకు, విదేశీయులకు ప్రత్యేక ఆహారం
- లక్షణాలు ఉన్నవారికి ఐసోలేషన్‌లో చికిత్స
కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ప్రతి రోజు వందలాది మంది ప్రజలు వివిధ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో చేరుతున్నారు. వైరస్ సోకిన బాధితులతో పాటు ఆ లక్షణాలతో పరీక్షలు చేయించుకొని ఫలితాల కోసం వేచిచూస్తున్న వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచుతున్నారు.
ఇక కరోనా బాధితుల కోసం కేరళ అందరికంటే ముందుగా ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. కరోనా నేపథ్యంలో ప్రజల ఆహార అలవాట్లపై అనేక అనుమానాలు వ్యాపిస్తుండగా.. ఐసోలేషన్ వార్డులో ఉన్న వారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నామో కేరళ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. కళామస్సెరీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెండు రకాల మెనూ ఏర్పాటు చేశారు. ఒకదాన్ని భారతీయులకు, మరో మెనూను విదేశీయులకు అందిస్తున్నట్టు ఎర్నాకులం జిల్లా కలెక్టర్ ఎస్. సుహాస్ చెప్పారు.
భారతీయులకు అందిస్తున్న మెనూలో మాములు వ్యక్తులు రోజూ తినే ఆహార పదార్థాలే ఉన్నాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ, సాంబార్, రెండు ఉడకబెట్టిన గుడ్లు, ఆరెంజ్ పండ్లు, టీ అందజేస్తున్నారు. ఆ వెంటనే ఉదయం 10.30 గంటల సమయంలో పండ్ల రసం ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో చపాతీలు, కేరళ మీల్స్ పాటు చేపల ఫ్రై, మినరల్ వాటర్ ఉన్నాయి. ఆపై, మూడు గంటల సమయంలో టీతో పాటు బిస్కెట్లు అందజేస్తున్నారు. ఇక, రాత్రి భోజనంలో అన్నంతో పాటు రెండు అరటి పండ్లు ఇస్తున్నారు.
విదేశీయులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం వాళ్లకు నప్పే ఆహారాన్ని అందిస్తోంది. బ్రేక్‌ఫాస్ట్‌లో సూప్, పండ్లు, రెండు గుడ్లు ఉన్నాయి. ఆ తర్వాత పైనాపిల్ జ్యూస్ ఇస్తున్నారు. లంచ్‌లో టోస్టెడ్ బ్రెడ్, ఛీస్‌తో పాటు కొన్ని పండ్లు అందజేస్తున్నారు. ఆ తర్వాత టీకి బదులు పండ్ల రసం ఇస్తున్నారు. రాత్రి భోజనంలో టోస్టెడ్ బ్రేడ్, ఎగ్స్ , పండ్లు అందిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరికి వార్తా పత్రికలు కూడా అందుబాటులో ఉంచారు. ఐసోలేషన్ వార్డుల్లో అన్ని సాధారణ సౌకర్యాలు ఉన్నాయని ఎర్నాకులం కలెక్టర్ తెలిపారు.