- అంతా ఇటీవల విదేశాల నుంచి వచ్చినవారే..
- 196 మందిలో కేవలం 29 మంది ఆచూకీ గుర్తించిన అధికారులు
- అడ్రస్ లు, ఇతర వివరాల్లో తప్పులతో గుర్తించలేని పరిస్థితి
వివిధ దేశాల నుంచి ఇటీవలే పంజాబ్ లోని లూథియానాకు వచ్చిన 167 మంది వ్యక్తుల వివరాలు లభించడం లేదని ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చినవారిలో కరోనా వైరస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీరి అడ్రస్ లు లభించకపోవడం ఆందోళనకరంగా మారిందని ప్రకటించారు. వారి ఆచూకీ కోసం రెండు బృందాలతో వెతుకుతున్నట్టు తెలిపారు.
మొత్తం 196 మంది
కొన్ని రోజులుగా లూథియానాకు విదేశాల నుంచి 196 మంది వచ్చినట్టు అక్కడి అధికారులు గుర్తించారు. ఉత్తర భారత దేశంలోని పలు ఎయిర్ పోర్టుల్లోని సమాచారం ఆధారంగా వారి పేర్లు, వివరాలు సేకరించారు. వారందరినీ ఇళ్లలోనే క్వారంటైన్ చేయాలని, కరోనా లక్షణాలు ఉన్నవాళ్లను హస్పిటళ్లలోని ఐసోలేషన్ వార్డులకు తరలించాలని నిర్ణయించారు. కానీ మొత్తం 196 మందిలో కేవలం 29 మంది ఆచూకీ మాత్రమే గుర్తించగలిగారు.
తప్పుడు అడ్రస్ లు, వివరాలు
లూథియానాకు వచ్చినవారి పాస్ పోర్టుల్లోని అడ్రస్, ఇతర వివరాలు తప్పుగా ఉన్నాయని.. వారు ఆ అడ్రస్ లలో లేరని లూథియానా సిటీ సివిల్ సర్జన్ రాజేశ్ బగ్గా వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చినవారిలో 119 మందిని ట్రేస్ చేసే బాధ్యతను పోలీసులకు, 77 మందిని గుర్తించే బాధ్యతను ఆరోగ్య శాఖకు అప్పగించారని తెలిపారు. పోలీసులు 12 మందిని, ఆరోగ్య శాఖ అధికారులు 17 మందిని మాత్రమే గుర్తించగలిగారని.. మిగతా 167 మంది ఆచూకీ తెలియడం లేదని వివరించారు. మిస్సింగ్ అయిన వ్యక్తుల్లో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే.. ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని గుర్తించే పని ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు.