Corona Virus: కరోనా కమ్ముకొస్తోంది.. రాజకీయ పంతాలకు పోకండి: ఏపీ ప్రభుత్వానికి పవన్​ సూచన

Dont get into a political bet amid corona epidemic pavan to AP government

  • విద్యా సంస్థల బంద్, ఇతర చర్యలు చేపట్టండి
  • కేంద్ర మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలి
  • పార్టీలు, స్వచ్చంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలని విజ్ఞప్తి

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోందని, అది ప్రవేశించిన రెండు వారాల తర్వాత విస్తృతి ఉంటుందని ఇతర దేశాల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అందువల్ల కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఏపీ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పంతాలు, పట్టింపులకు పోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సూచించినట్టుగా వెంటనే విద్యా సంస్థల బంద్, ఇతర చర్యలను అమల్లోకి తేవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి

ప్రజల ఆరోగ్యానికి తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని, పట్టింపులు వద్దని ఏపీ ప్రభుత్వానికి పవన్ సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా కూడా తేలిగ్గా తీసుకోవడం సరికాదన్నారు. కరోనా మహమ్మారి విషయంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని.. అన్ని ప్రభుత్వ విభాగాలను అప్రమత్తం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో స్క్రీనింగ్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులు, ల్యాబ్ లను పెంచాలన్నారు. ‘‘మన రాష్ట్రంలో లేదు.. వైరస్ పోతుంది అనుకునే పరిస్థితి లేదు. కేంద్ర మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలి” అని స్పష్టం చేశారు.

సామాజిక బాధ్యతగా గుర్తించండి

కరోనా వైరస్ కట్టడి కోసం తీసుకునే చర్యలను సామాజిక బాధ్యతగా గుర్తించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆఫీసులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు, సంఘాలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. జనసేన తరఫున ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు దీనికి సంబంధించిన ప్రణాళిక ఇచ్చామని తెలిపారు.

  • Loading...

More Telugu News