KCR: ఓపక్క కరోనా కేసులు పెరుగుతుంటే.. ఆయన ఫాంహౌస్ కెళ్లి సేద తీరుతున్నారు: కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్
- కరోనా ప్రభావం లేదన్న కేసీఆర్ రక్షణ కోసం ఫాంహౌస్‌కు వెళ్లారు
- సామాన్యులు ఎక్కడికి వెళ్లాలి?
- హైదరాబాద్ వచ్చి పనులు పర్యవేక్షించాలి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్టంలో కరోనా కేసులే లేవన్న ముఖ్యమంత్రి మాత్రం ప్రగతి భవన్ నుంచి తప్పించుకుని గజ్వేల్ ఫాం హౌస్‌లో సేద తీరుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. మరి హైదరాబాద్‌లోని సామాన్యులు ఎక్కడికి వెళ్లాలని విజయశాంతి ప్రశ్నించారు. ఆ విషయాన్ని కేసీఆరే చెబితే బాగుంటుందని అన్నారు.
సీఎం వెంటనే హైదరాబాద్ వచ్చి కరోనా వైరస్ నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను నేరుగా పర్యవేక్షించాలని కోరారు. తెలంగాణలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయని, హైదరాబాద్‌లోనూ ఈ సమస్య ఉందని అన్నారు. కరోనా సమస్య ఒక్క హైదరాబాద్‌లోనే ఉందని, జిల్లాల్లో ఉండదని చెప్పిన కేసీఆర్ తన భద్రత కోసం ఫాంహౌస్‌కు వెళ్లిపోయారని ప్రజలు చర్చించుకుంటున్నారని విజయశాంతి పేర్కొన్నారు.