Corona Virus: అమరావతిని తాకిన కరోనా... సకలం బంద్ కు చర్యలు!
- అమెరికా నుంచి మంగళగిరికి వృద్ధ జంట
- వారిని కలిసి వెళ్లిన ఎంతో మంది
- మహిళకు కరోనా లక్షణాలతో కలకలం
- హోటళ్లు, వ్యాపార సముదాయాల మూసివేతకు ఆదేశాలు
కరోనా భయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తాకింది. మంగళగిరి పట్టణానికి వారం రోజుల క్రితం అమెరికా నుంచి వృద్ధ దంపతులు రాగా, నాలుగు రోజుల పాటు వారింట్లో పండగ వాతావరణం నెలకొంది. ఆపై విదేశం నుంచి వచ్చిన మహిళ జలుబు, జ్వరం సోకగా, కరోనా ఆందోళనతో తొలుత ఫీవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో, రక్త నమూనాలను తిరుపతికి పంపించారు. ఇప్పుడు ఆమె భర్త కూడా జలుబు, జ్వరంతో బాధపడుతూ ఉండటంతో విషయం తెలుసుకున్న అధికారులు సత్వర చర్యలకు ఉపక్రమించారు.
కాగా, ఈ దంపతులు అమెరికా నుంచి వచ్చిన తరువాత, పలువురు వచ్చి కలిసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారందరిలో తీవ్రమైన భయాందోళన నెలకొంది. ఒకవేళ, వీరికి కరోనా సోకితే, వారిని కలిసిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు అంటున్నారు. ఇప్పటికే అమరావతి పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజలు రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలను తక్షణం నిలిపివేయాలని, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు కోరారు.
మరోపక్క, కరోనా మంగళగిరికి సోకకుండా చర్యలు ప్రకటించారు. రోడ్ల పక్కన ఉండే అల్పాహార శాలలు, చికెన్, మటన్ దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లను మూసివేయాలని సూచించారు. ఈ నెల 31 వరకూ అన్ని బహిరంగ వ్యాపార సముదాయాలనూ మూసి వేయాలని అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. తమ ఉత్తర్వులు అతిక్రమిస్తే, కఠిన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు.