Kurnool District: శ్రీశైలం భక్తులకు కరోనా ఎఫెక్ట్... పాతాళగంగ స్నానాల ఘాట్ మూసివేత
- నిర్ణయాన్ని ప్రకటించిన ఆలయ అధికారులు
- అన్నదాన సత్రంలోనూ మార్పులు
- భోజనం ప్యాకెట్ల రూపంలో అందించాలని నిర్ణయం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం పరిధిలోని పాతాళగంగ స్నాన ఘాట్ ను అధికారులు మూసివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. జనసందోహం ఉండే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కరోనా ప్రభావం పడకుండా చర్యలు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అలాగే అన్నదాన సత్రంలోనూ మార్పులు చేపట్టారు. ఇకపై భక్తులకు భోజనం వడ్డించడం కాకుండా ప్యాకెట్ల రూపంలో అందించాలని నిర్ణయించినట్లు కార్యనిర్వాహక అధికారి కె.ఎస్.రామారావు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారెవరూ స్వామి వారి దర్శనానికి రావద్దని ఆయన కోరారు. అలాగే భక్తుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణం 104కు సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.