Pakistani Doctor: ఐసిస్ లో చేరాలనుకున్న పాకిస్థాన్ డాక్టర్.. అమెరికాలో అరెస్ట్!
- వర్క్ వీసా మీద అమెరికాలో ఉన్న ముహమ్మద్ మసూద్
- ఈ నెలఖారుకు సిరియాకు వెళ్లాలనుకున్న వైనం
- కరోనా నేపథ్యంలో ప్లాన్ మార్చుకున్న మసూద్
పాకిస్థానీ డాక్టర్, మేయో క్లినిక్ రీసర్చ్ (మిన్నెసోటా) కోఆర్డినేటర్ ముహమ్మద్ మసూద్ (28)ని ఉగ్రవాద ఆరోపణలతో అమెరికాకు చెందిన ఎఫ్బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని మిన్నెసోటా నగరంలోని సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ కు మద్దతుదారుడిగా మసూద్ వ్యవహరిస్తున్నాడని, అమెరికాలో ఒంటరిగానే ఉగ్ర దాడులను నిర్వహించాలనుకున్నాడనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి.
వర్క్ వీసా మీద మసూద్ అమెరికాలో ఉంటున్నాడు. ఐసిస్ నేతలను కలిసేందుకు సిరియాకు కూడా వెళ్లాలనుకున్నాడు. ఫిబ్రవరి 21న ఆయన ఎయిర్ టికెట్ కొన్నాడు. షికాగో నుంచి జోర్డాన్ మీదుగా సిరియాకు వెళ్లాలనుకున్నాడు. మార్చి చివరికల్లా అమెరికా నుంచి బయల్దేరాలనుకున్నాడు. అయితే, కరోనా భయాల కారణంగా జోర్డాన్ తన సరిహద్దులను మూసి వేయడంతో తన ప్లాన్ ను మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తనకు సహకరిస్తున్న వ్యక్తితో కలసిన కొత్త ప్లాన్ వేశాడు. మిన్నెపోలిస్ నుంచి లాస్ ఏంజెలెస్ కు వెళ్లి సదరు వ్యక్తిని కలవాలనుకున్నాడు. అక్కడి నుంచి కార్గో షిప్ ద్వారా ఐసిస్ టెర్రిటరీకి వెళ్లాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో, లాస్ ఏంజెలెస్ కు వెళ్తున్న ఆయనను ఎఫ్బీఐ అధికారులు అరెస్ట్ చేశారు.