Corona Virus: భారత్ లో వేగం పుంజుకున్న కరోనా... నిన్న 167, ఇవాళ 223 కేసులు!
- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక
- ఢిల్లీ, యూపీలోనూ పెరిగిన కేసుల సంఖ్య
- ఏపీలో 3, తెలంగాణలో 8 కేసుల నమోదు
చైనాలో పుట్టి ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లో విజృంభిస్తోంది. మరణాలు ప్రమాదకర స్థాయిలో లేకున్నా, వేగంగా విస్తరిస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. నిన్న భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 167 కాగా, ఇవాళ అది 223కి చేరింది. నిన్నటివరకు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనే అధికంగా నమోదైన కరోనా కేసులు ఇప్పుడు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లోనూ రెండంకెల సంఖ్యకు చేరాయి. యూపీలో 22, ఢిల్లీలో 16, రాజస్థాన్ లో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర (49) అగ్రస్థానంలో ఉంది. కేరళలో 26, కర్ణాటకలో 15 మంది కరోనా బాధితులు ఉన్నట్టు గుర్తించారు. ఇక ఏపీలో 3, తెలంగాణలో 8 కేసులు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం భారత్ లో ఉన్న కరోనా బాధితుల్లో 32 మంది విదేశీయులు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నలుగురు కరోనాతో మరణించారు.