Alla Nani: రాష్ట్రాలకు ఆర్థికసాయం అవసరమని ప్రధానికి సీఎంలు చెప్పారు: మంత్రి ఆళ్ల నాని
- సీఎంలు, ఆరోగ్య శాఖ మంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
- ‘కరోనా’ నిర్ధారణకు దేశ వ్యాప్తంగా ల్యాబ్స్ అవసరమని చెప్పాం
- ‘కరోనా’ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది
రాష్ట్రాలకు ఆర్థికసాయం అవసరమని మోదీకి సీఎంలు తెలియజేశారని ఏపీ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టే నిమిత్తం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆళ్ల నాని కూడా పాల్గొన్నారు.
అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘కరోనా’ నిర్ధారణకు దేశ వ్యాప్తంగా ల్యాబ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇప్పటి వరకు 128 నమూనాలను పరీక్షలకు పంపించామని చెప్పారు. అన్ని విభాగాల సమన్వయంతో పని చేస్తున్నామని చెప్పారు. ‘కరోనా’ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలందరూ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని చెప్పారు.