KCR: ప్రధాన మంత్రిని కూడా అవహేళన చేసేలా మాట్లాడుతున్నారు.. ప్రధానిని గౌరవించాలి: కేసీఆర్
- జనతా కర్ఫ్యూ పూర్తైన తర్వాత 2 నిమిషాలు చప్పట్లు కొట్టాలని మోదీ పిలుపునిచ్చారు
- కొందరు వెధవలు అవహేళన చేస్తూ కామెంట్లు చేస్తున్నారు
- తెలంగాణ ప్రజలంతా రేపు 5 గంటలకు చప్పట్లు కొట్టండి
జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు సాయంత్రం ఐదు గంటలకు 2 నిమిషాల పాటు అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మోదీ సూచనను అవహేళన చేస్తూ కొందరు పనికిమాలిన వెధవలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చప్పట్లు కొట్టడమనేది ఒక సంఘీభావానికి ప్రతీక అని ఆయన అన్నారు. మోదీ చెప్పింది మంచి ఉద్దేశంతోనే అని... నగరాలు, పట్టణాల్లో ఉన్న వాళ్లు బాల్కనీల్లోకి వచ్చి చప్పట్టు కొట్టాలని... గ్రామాల్లో ఉన్నవారు ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి సంఘీభావాన్ని ప్రకటించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో తాను కూడా ఎన్నో పిలుపులు ఇచ్చానని... ఇంటి నుంచి బయటకు వచ్చి ప్లేట్లను గరిటలతో కొట్టాలని చెప్పాలని... ఇదంతా ఐక్యతను పెంపొందించేందుకేనని కేసీఆర్ చెప్పారు. రేపు తాను, తన కుటుంబసభ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ బయటకు వచ్చి చప్పట్టు కొడతామని అన్నారు.
ప్రధాని అనే గౌరవం కూడా లేకుండా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నానని అన్నారు. ప్రధాని పిలుపు మేరకు రేపు సాయంత్రం 5 గంటలకు అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టి, ఐక్యతను చాటుదామని పిలపునిచ్చారు. ఈ ఐక్యతతో కరోనా పారిపోవాలని అన్నారు.