Corona Virus: చైనాలో వింత... కరోనా వల్ల గతం గుర్తొచ్చింది!
- ఓ ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పోయిన చైనీయుడు
- కరోనా వార్తల్లో స్వగ్రామం పేరు విని గతం గుర్తొచ్చిన వైనం
- త్వరలోనే కుటుంబ సభ్యులను కలవనున్న వ్యక్తి
కరోనా ధాటికి చైనా అంతటి అగ్రదేశం సైతం భీతిల్లిపోయిందంటే అతిశయోక్తికాదు. వేలమంది చైనీయులు ఈ మహమ్మారి ప్రభావంతో ప్రాణాలు కోల్పోయారు. కానీ ఓ వ్యక్తికి మాత్రం మర్చిపోయిన గతం కరోనా కారణంగా గుర్తొచ్చింది. ఇప్పుడా వ్యక్తి మూడు దశాబ్దాల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకోబోతున్నాడు. వివరాల్లోకెళితే...
చైనాలోని గియిజు ప్రావిన్స్ కు చెందిన 57 ఏళ్ల జు జియామింగ్ ఓ కార్మికుడు. 90వ దశకం ఆరంభంలో ఉపాధి కోసం మరో ప్రాంతానికి వలసవెళ్లాడు. అయితే పనిచేస్తుండగా ఓ ప్రమాదంలో గాయపడి జ్ఞాపకశక్తి కోల్పోయాడు. అతడి వద్ద ఐడెంటిటీ కార్డు కూడా లేకపోవడంతో అతడి వివరాలను అధికారులు గుర్తించలేకపోయారు. అటు స్వగ్రామంలో అతని తల్లి మిస్సింగ్ కేసు పెట్టింది. జియామింగ్ ఆచూకీ లేకపోవడంతో కేసు కూడా కొట్టివేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో జియామింగ్ ను ఓ జంట చేరదీసింది. తమ కుటుంబసభ్యుడిగా భావించి ఆదరించింది. జియామింగ్ తన స్వగ్రామం గురించి, తన కుటుంబసభ్యుల గురించి ఎంత జ్ఞాపకం చేసుకున్నా ఒక్క విషయం కూడా గుర్తుకు రాక ఎంతో బాధపడేవాడు. అయితే ఇటీవల కరోనాకు సంబంధించిన వార్తలు జియామింగ్ చెవినబడ్డాయి.
ఆ వార్తల్లో అతడి స్వగ్రామం చిషు పేరు కూడా వినిపించింది. చిషు గ్రామంలో కూడా కరోనా మరణం సంభవించిందన్న వార్త వినడంతో జియామింగ్ లో జ్ఞాపకాలు పురివిప్పాయి. తన సొంత ఊరు గుర్తుకు రావడమే కాదు అయినవాళ్లందరూ కళ్లముందు మెదిలారు. వెంటనే పోలీసులను కలిసి తన పరిస్థితి వివరించాడు. పోలీసులు జియామింగ్ కథ విని వెంటనే చర్యలు తీసుకున్నారు. వీడియో కాల్ ద్వారా అతడి తల్లితో మాట్లాడించారు. త్వరలోనే కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.