shoib akhtar: ఇప్పుడు హిందు, ముస్లింలలా కాదు.. మనుషులుగా ఉండాల్సిన సమయమిది: షోయబ్‌ అక్తర్

Time To Be Human Not Hindu Muslim urges Shoaib Akhtar

  • కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఒక్కటవ్వాలని పిలుపు
  • సరుకులు దాచుకోవద్దని సూచన
  • రోజువారీ కూలీల పరిస్థితి ఆలోచించాలని విజ్ఞప్తి

ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ పిలుపునిచ్చాడు. ఈ కష్టకాలంలో డబ్బు, మతం కంటే మించి ఎదగడానికి ఒకరికొకరు సాయం చేసుకోవాలని కోరాడు. ఈ సమయంలో ఐక్యంగా ముందుకెళ్తూ, తమ ప్రభుత్వ మార్గదర్శకాలకు  కట్టుబడాలని ఓ యూ ట్యూబ్‌ చానల్‌తో మాట్లాడిన అక్తర్
సూచించాడు.

‘ప్రపంచ వ్యాప్తంగా నా అభిమానులందరికీ విజ్ఞప్తి. కరోనా వైరస్ అనేది ప్రపంచ సంక్షోభం. ఈ సమయంలో మనమంతా ప్రపంచ శక్తిగా ఆలోచించాలి. మతం కంటే పైకి ఎదగాలి. వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకరినొకరు కలుస్తూ, సమూహాలుగా ఏర్పడితే వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేం. దుకాణాలన్నీ ఖాళీ అయ్యాయి.

ఒకవేళ మీరు సరుకులు నిల్వ చేసుకొని ఉంటే, దయచేసి దినసరి కూలీల గురించి కూడా ఆలోచించండి. వాళ్ల కుటుంబాలు ఏం తిని బతుకుతాయో కాస్త ఆలోచించండి. పరిస్థితి ఇలానే ఉంటే మూడు నెలల తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి? కాబట్టి  ఇతరుల గురించి కూడా పట్టించుకోండి. ఈ సమయంలో మనం మనుషులుగా ఉండాలి కానీ హిందూ, ముస్లింలుగా కాదు’ అని అభిప్రాయపడ్డాడు.

కష్టకాలంలో ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకోవాలని అక్తర్ సూచించాడు. ‘ధనవంతులు ఎలాగైనా బతుకుతారు. మరి పేదలు ఎలా జీవించాలి? వారిపై కాస్త దయ చూపించండి. మనం జంతువుల్లా కాదు, మనుషుల్లా జీవించాలి. ఇతరులకు సాయం చేసే ప్రయత్నం చేయండి. దయచేసి వస్తువులను నిల్వచేసుకోవడం ఆపండి. ఇప్పుడు మనం  ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. అంతేకాని మన మధ్య అంతరాలు ఉండకూడదు. అందరం మనుషుల్లా జీవించాలి’ అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News