Andhra Pradesh: కరోనా వైరస్‌ను వ్యాపింపజేస్తే రెండేళ్లు.. క్వారంటైన్ ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు: ఏపీ డీజీపీ కార్యాలయం హెచ్చరిక
- ఉద్దేశపూర్వకంగా వైరస్‌ను వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలు
- సెక్షన్ 270 ప్రకారం చర్యలు
- 31 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది
కరోనా వైరస్‌పై పోరును మరింత ఉద్ధృతం చేసిన ఏపీ ప్రభుత్వం అందులో భాగంగా మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యాధుల వైరస్లు, ఇన్ఫెక్షన్లు వంటి వాటిని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ కార్యాలయం హెచ్చరించింది.
భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 270 ప్రకారం ఇలాంటి వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్టు తెలిపింది. అలాగే, క్వారంటైన్లో ఉన్న కరోనా అనుమానితులు దానిని ఉల్లంఘించి బయటకు వస్తే ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని పేర్కొంది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని, ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. కాబట్టి అందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించింది.