Telangana: తెలంగాణలోని మద్యం డిపో నుంచి 120 కేసుల బీర్లు చోరీ!
- దేవరయాంజల్ సమీపంలో ఘటన
- లాక్ డౌన్ కారణంగా అన్ లోడ్ కాని లారీ
- విషయం తెలుసుకుని లూటీ
అసలే లాక్ డౌన్. మద్యం దుకాణాలన్నీ బంద్. గత పది రోజులుగా మందు అందుబాటులో లేక పిచ్చెక్కిపోయారో ఏమో... ఏకంగా మద్యం డిపో వద్ద ఆగివున్న లారీ నుంచి ఏకంగా 120 కేసుల బీర్ ను లూటీ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటన దేవరయాంజల్ పరిధిలోని డిపో-1 వద్ద జరిగింది.
వివరాల్లోకి వెళితే, మల్లేపల్లి నుంచి దేవరయాంజల్ కు ఏపీ 27 డబ్ల్యూ 7758 నంబర్ గల లారీలో కింగ్ ఫిషర్ లోడ్ వచ్చింది. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా దీన్ని అన్ లోడ్ చేయలేదు. విషయం తెలుసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు, ప్రహరీ గోడకు రాళ్లను పెట్టి గోడౌన్ లోకి దిగి, లారీ టార్పాలిన్, తాళ్లను కత్తిరించి, బీర్లను ఎత్తుకెళ్లారు. నిన్న ఈ విషయాన్ని గమనించిన లారీ డ్రైవర్, డిపో మేనేజర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఇది ఇంటి దొంగల పనా? లేక మరెవరైనా దొంగతనం చేశారా? అన్న కోణంలో విచారిస్తున్నారు.