AP-Telangana boarder: రాష్ట్రంలో ప్రవేశానికి ఓకే... ముందు క్వారంటైన్ కేంద్రానికి వెళ్లాలి: గుంటూరు జేసీ
- తొలుత వైద్య పరీక్షల నిర్వహణ
- అనంతరం క్వారంటైన్ కేంద్రాలకు తరలింపు
- సమస్యలేదని తెలిస్తేనే సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి
ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో చిక్కుకున్న వారి విషయంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చిన వారిని రాష్ట్రంలోకి అనుమతించడానికి అభ్యంతరం లేదని, అయితే ముందు వారు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేందుకు అంగీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పలు కారణాల రీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన వలసవాసులు సొంతూర్లకు వెళ్లిపోయేందుకు ఈ రోజు తెల్లవారు జాముకి భారీ సంఖ్యలో సరిహద్దుకు చేరుకున్నారు. అయితే వీరిని ఆంధ్రాలోకి పోలీసులు అనుమతించడం లేదు. ఇదికాస్తా వివాదం కావడంతో జేసీ స్పష్టమైన వివరణ ఇచ్చారు.
'సరిహద్దు దాటి వచ్చిన వారిని నిబంధనల ప్రకారం వెంటనే ఊర్లలోకి అనుమతించం. తొలుత క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తాం. అక్కడ పరీక్షల్లో ఏ సమస్యా లేదని తేలాలి. అప్పుడే వారిని సొంతూర్లకు వెళ్లేందుకు అనుమతిస్తాం' అని తెలిపారు. ఇందుకు అవసరమైన క్వారంటైన్ కేంద్రాలను సరిహద్దులో ఏర్పాటు చేశామని, మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని నల్గొండ అధికారులను కోరుతామని తెలిపారు.
ఈ సమస్యపై గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ 'ముందస్తు సమాచారం లేకుండా వీరంతా హైదరాబాద్ నుంచి ఒకేసారి రావడం వల్లే సమస్య ఏర్పడింది. సమస్యపై చర్చిస్తున్నాం. వారిపట్ల సంయమనంతో వ్యవహరించాలని సిబ్బందిని కూడా ఆదేశించాం' అని తెలిపారు.