Kesineni Nani: ఐసోలేషన్ వార్డులను నగరాలకు దూరంగా పెట్టండి: కేశినేని నాని
- ఐసోలేషన్ కేంద్రాలు నగరంలో వద్దు
- వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి
- సీఎం జగన్ కు కేశినేని విజ్ఞప్తి
రాష్ట్రంలో కరోనా వ్యాధి బాధితుల ఐసోలేషన్ వార్డులను నగరాలకు దూరంగా పెట్టాలని తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని సూచించారు. ఐసోలేషన్ కేంద్రాలను నగరాల్లోనే ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆయన అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టారు.
"దయచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు. కరోనా ఐసోలేషన్ వార్డులను నగరానికి దూరంగా పెట్టండి" అని ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మునిసిపల్ కమిషనర్ లను కోరారు. అంతకుముందు "విజయవాడ నడిబొడ్డున వున్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని 6 జిల్లాలకు చెందిన కరోనా వ్యాధి గ్రస్థులకు ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ జనావాసాల మధ్యలో ఐసోలేషన్ వార్డులు పెట్టటం ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి" అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు.