Ram Gopal Varma: ఇలా చేస్తే.. జనాలు మీ నెత్తినెక్కి కూర్చుంటారు: పోలీసులకు రామ్ గోపాల్ వర్మ హితవు
- లాక్ డౌన్ లో రోడ్లపైకి వస్తున్న జనాలు
- రోడ్లపైకి రావద్దంటూ జనాలకు నమస్కరిస్తున్న పోలీసులు
- జనాలతో స్నేహపూర్వకంగా ఉండొద్దన్న వర్మ
లాక్ డౌన్ నేపథ్యంలో... ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని ప్రభుత్వం, పోలీసులు విన్నవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ హెచ్చరికలను పక్కన పెట్టి రోడ్లపైకి వస్తున్న వారిపై అక్కడక్కడా పోలీసులు లాఠీ ఝుళిపిస్తున్నారు. మరికొన్ని చోట్ల రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు చేతులెత్తి నమస్కరిస్తూ... రోడ్లపైకి రావద్దని విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు ట్విట్టర్ ద్వారా సూచనలు చేశాడు.
'పోలీసులకు నా విన్నపం ఏమిటంటే... జనాలతో స్నేహపూర్వకంగా ఉండకండి. వాళ్లు మీ నెత్తినెక్కి కూర్చుంటారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాలో జోకులు వెల్లువెత్తుతున్నాయి. వీటిని చూస్తుంటే ఫ్రెడ్రిచ్ చెప్పిన ఒక కోట్ నాకు గుర్తుకొస్తోంది. ప్రపంచంలో ఎక్కువగా ఆందోళన చెందే జంతువు మనిషే. భయంకరమైన వాస్తవాల నుంచి ఉపశమనం పొందేందుకు బలవంతంగా నవ్వులను పుట్టించుకుంటాడు' అని వర్మ అన్నాడు.