Ramcharan: 'బాబాయి చేసిన ట్వీట్‌తో స్ఫూర్తి పొందాను' అంటూ తొలి ట్వీట్ చేసి రూ.70 లక్షల సాయం ప్రకటించిన రామ్ చరణ్
- కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రిలీఫ్ ఫండ్‌కు విరాళం
- ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు తీసుకుంటున్న చర్యలు అభింనందనీయం
- అందరూ నిబంధనలకు లోబడే ఉండాలి
- చెర్రీకి చిరు, పవన్ అభినందనలు
కరోనా విభృంభణతో ఎదురవుతున్న సంక్షోభంలో జనసేన అధినేత, తన బాబాయి పవన్ కల్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకటించిన సాయంతో తాను కూడా స్ఫూర్తి పొంది విరాళం ఇద్దామని నిర్ణయించుకున్నానని సినీనటుడు రామ్ చరణ్ ప్రకటించారు. ప్రభుత్వాలు చేస్తోన్న కృషికి మద్దతుగా చిరు సాయం చేస్తున్నానని తెలిపారు. ప్రజలందరూ ఇంట్లోనే క్షేమంగా ఉండాలని ఆయన కోరారు.
'పవన్ కల్యాణ్ గారి ట్వీట్‌తో స్ఫూర్తి పొంది కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రిలీఫ్ ఫండ్‌కు మొత్తం కలిపి రూ.70 లక్షలు ప్రకటిస్తున్నాను. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. అందరూ నిబంధనలకు లోబడే ఉండాలని ఒక బాధ్యతగల పౌరుడిగా నేను కోరుతున్నాను' అని ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్లో అడుగుపెట్టిన కొద్దిసేపటికే 38,000 మంది ఆయనను ఫాలో అయ్యారు.
సింహాన్ని సింహం పిల్ల ఫాలో అవుతుంది: చిరంజీవి
ట్విట్టర్లో అడుగుపెట్టిన తన కుమారుడు రామ్‌చరణ్‌కు మెగాస్టార్ చిరంజీవి స్వాగతం పలికారు. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో రామ్‌చరణ్‌కు ఇప్పటికే ఖాతాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఉగాదిని పురస్కరించుకుని బుధవారం ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన విషయం తెలిసిందే. తండ్రి బాటలోనే చెర్రీ కూడా ట్విట్టర్లోకి అడుగుపెట్టాడు.
దీంతో రామ్‌చరణ్‌కు పలువురు టాలీవుడ్ నటులు స్వాగతం పలుకుతున్నారు. తొలి ట్వీట్లోనే కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విరాళాన్ని అందిస్తున్నట్టు చెర్రీ ప్రకటించి అందరి మనసు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరు ట్వీట్ చేస్తూ... 'ట్విట్టర్ ప్రపంచానికి రామ్‌చరణ్‌కు స్వాగతం.. సింహాన్ని సింహం పిల్ల ఫాలో అవుతుంది' అని పేర్కొన్నారు. చెర్రీ రూ.70 లక్షలు ప్రకటించిన అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించి ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు.