Mahesh Babu: కరోనా నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన మహేశ్ బాబు
- భారత్ లో పెరుగుతున్న కరోనా ప్రభావం
- తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ఉనికి
- మానవాళిని కాపాడుకుందాం అంటూ మహేశ్ బాబు పిలుపు
దాదాపు 195 దేశాలను భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ ప్రభావం చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు సైతం దీని బారినపడ్డాయి. ముఖ్యంగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీలో పరిస్థితి అదుపులో ఉన్నా ఈ వైరస్ వ్యాప్తి చెందే తీరు ఆందోళన కలిగిస్తోంది. దీనిపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు.
కరోనాను కట్టడి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. కరోనా మహమ్మారిపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ, ఏపీలకు మద్దతుగా నిలిచేందుకు సీఎం సహాయనిధికి విరాళం అందిస్తున్నానని వెల్లడించారు. ప్రతి విరాళం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి విరాళాలు అందించాలని మహేశ్ బాబు విజ్ఞప్తి చేశారు.
"ఈ కష్టకాలంలో లాక్ డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ నియమనిబంధనలు పాటించాలని ఓ బాధ్యత గల పౌరుడిగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఒకరికి ఒకరం మద్దతుగా నిలిచి మానవాళిని కాపాడుకుందాం" అంటూ పిలుపునిచ్చారు. "ఈ పోరాటంలో విజయం మనదే... అప్పటివరకు ఇంటికే పరిమితమవుదాం, సురక్షితంగా ఉందాం" అంటూ సందేశం వెలువరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం, మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్ లు కరోనాపై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.