Ventilator: కోవిడ్ పై పోరులో మహీంద్రా గ్రూప్ ముందడుగు... అత్యంత చౌకగా వెంటిలేటర్ తయారీ!
- రూ.7,500కే వాల్వ్ మాస్క్ వెంటిలేటర్
- మార్కెట్లో అత్యాధునిక వెంటిలేటర్ ఖరీదు రూ.5 లక్షల నుంచి ప్రారంభం
- కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామన్న మహీంద్రా గ్రూపు
కరోనా మహమ్మారి (కోవిడ్-19)పై పోరాటంలో భాగంగా దేశీయ కార్పొరేట్ సంస్థలు వైద్య పరికరాల తయారీలో విరివిగా పాలుపంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపునందుకున్న మహీంద్రా గ్రూప్ కీలక ముందడుగు వేసింది. అన్ని సదుపాయాలతో కూడిన ఆధునిక వెంటిలేటర్లు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర పలుకుతుండగా, మహీంద్రా గ్రూప్ కేవలం రూ.7,500 కే వెంటిలేటర్ ను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఓ స్వదేశీ ఐసీయూ వెంటిలేటర్ల తయారీ సంస్థతో చేతులు కలిపిన మహీంద్రా సంస్థ చవకైన వెంటిలేటర్ల మోడళ్లను రూపొందించింది. మరో మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మోడళ్లకు ఆమోదం లభిస్తే పెద్ద ఎత్తున తయారుచేసేందుకు సన్నద్ధమైంది. కాగా, ఈ వెంటిలేటర్ కు అంబు బ్యాగ్ గా నామకరణం చేశారు. ఇది వాల్వ్ మాస్క్ ఆటోమేటెడ్ వెర్షన్ వెంటిలేటర్. తక్కువ ధరతో తాము రూపొందించే వెంటిలేటర్లు దేశంలో వెంటిలేటర్ల కొరతను గణనీయంగా తగ్గిస్తాయని మహీంద్రా వర్గాలు భావిస్తున్నాయి.