Nizamabad District: దుబాయ్ నుంచి వచ్చి.. 'కరోనా' నిబంధనలు పాటించని తెలంగాణ యువకుడిపై కేసు నమోదు
- నిజామాబాద్ జిల్లాలోని బస్వాపూర్ కు చెందిన యువకుడు
- ఇటీవలే దుబాయ్ నుంచి రాక
- హోం క్వారంటైన్ పాటించకుండా ఇష్టానుసారం తిరిగాడు
- కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీస్ కేసు నమోదు
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. విదేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి పాజిటివ్ గా తేలితే ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తూ, ‘నెగెటివ్’ వస్తే కనుక హోం క్వారంటైన్ పాటించాలని ఆదేశించింది.
అయితే, ఈ ఆదేశాలను బేఖాతరు చేసిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు ఈ నెల 13న దుబాయ్ నుంచి తన స్వగ్రామం వచ్చాడు. అయితే, సంబంధిత నిబంధనలు పాటించకుండా బయట గ్రామాలకు వెళ్లొస్తున్నాడు. ఈ విషయమై సంబంధిత అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో నవీన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని కోటగిరి ఎస్ ఐ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ కేసు నమోదు చేశామని అన్నారు. బయట దేశాల నుంచి జిల్లాకు సుమారు మూడు వేల మంది వచ్చారని, వీరిలో ఎవరికి ‘కరోనా’ లక్షణాలు ఉన్నాయో తెలియవని, అందుకే, హోం క్వారంటైన్ లో ఉండాలని చెబుతున్నామని అన్నారు.