SP Balasubrahmanyam: కరోనా యోధుల కోసం.. పాటలు పాడి నిధులు సేకరించాలని ఎస్పీ బాలు నిర్ణయం
- ఫేస్ బుక్ లో శ్రోతలు కోరిన పాటలు పాడాలని నిర్ణయం
- ఒక్కో పాటకు రూ.100 రుసుం
- వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల కోసం బాలు గళం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాపై పోరాటంలో విశేష సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల కోసం పాటలు పాడి నిధులు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రోతలు కోరిన పాటలను ఆయన ఫేస్ బుక్ లో పాడి వినిపిస్తారు. అందుకు ఒక్కో శ్రోత రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా వచ్చిన నిధులను కరోనా పోరాట వీరులకు అందిస్తారు.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా, భక్తి గీతాలు ఏవైనా పాడమని అడగొచ్చని, అయితే ముందు అడిగిన వారికే ప్రాధాన్యత ఉంటుందని బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. శనివారం, సోమవారం, బుధవారం, గురువారాల్లో రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు అరగంట పాటు పాడతానని, పూర్తి పాట పాడితే అరగంటలో నాలుగైదు పాటల కంటే ఎక్కువ పాడలేమని, అందుకే ఒక పల్లవి, ఒక చరణంతో ముగిస్తానని వెల్లడించారు. రుసుం చెల్లించేందుకు బ్యాంకు ఖాతా నంబరు తదితర వివరాలను ఫేస్ బుక్ లో తెలియజేస్తానని పేర్కొన్నారు.
ఓ శ్రోత కోరిన పాటను తాను ఆ మరుసటి రోజు పాడతానని, అన్ని పాటలు తనకు గుర్తుండకపోవడమే అందుకు కారణమని వివరించారు. వచ్చిన నిధులను పీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలో, ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలో శ్రోతల అభిప్రాయాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.