Chandrababu: ఓ తుపాను, ఓ భూకంపం వస్తే ఓ ప్రాంతానికే పరిమితం... ఇది అలా కాదు: చంద్రబాబు
- కరోనాను వదిలేస్తే ప్రపంచాన్ని కబళిస్తుందని హెచ్చరిక
- సకాలంలో స్పందించకపోతే భారీ నష్టం తప్పదన్న చంద్రబాబు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతతో వ్యవహరించాలని సూచన
కరోనా భూతం విషయంలో ముందుజాగ్రత్తలు తీసుకోకపోతే భారీ నష్టం తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సకాలంలో స్పందించడం వల్లే అనేక దేశాల్లో కరోనా నియంత్రణలో ఉందని అన్నారు. కరోనా సోకిన ఓ వ్యక్తి ఆరు రోజుల పాటు సమాజంలో తిరిగితే 3200 మందికి పైగా అంటిస్తాడని చైనాలో గవర్నర్ అధ్యయన పూర్వకంగా చెప్పారని, ఇలాంటి వాస్తవాలను విస్మరిస్తే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో బాధ్యతతో వ్యవహరించాలని, ఓ తుపాను కానీ, ఓ భూకంపం కానీ సంభవిస్తే అది ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందని, కానీ కరోనా అలా కాదని, ప్రపంచాన్ని కబళించివేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు స్వచ్ఛంద సేవాసంస్థలు, వ్యక్తులు కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయం అని, ఇక్కడ రాజకీయాలకు తావులేదని అన్నారు. ఇక ప్రజలకు కూడా చంద్రబాబు సూచనలు చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎక్కడివాళ్లు అక్కడ ఉంటేనే శ్రేయస్కరం అని స్పష్టం చేశారు. రాష్ట్రాల సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు కలిగించకూడదని విజ్ఞప్తి చేశారు.
ప్రధాని తీసుకున్న 21 రోజుల లాక్ డౌన్ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రశంసించారు. కరోనాను ఎదుర్కోవడంలో దీన్ని మించిన నిర్ణయం మరొకటి ఉంటుందని అనుకోవడంలేదని అన్నారు. కరోనా పరీక్షల విషయంలో దక్షిణ కొరియాను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అక్కడ 7 నిమిషాల్లోనే కరోనా టెస్టు చేస్తారని, తుమ్మినా, దగ్గినా వెంటనే పరీక్షించి ఫలితాలు చెప్పే వ్యవస్థ దక్షిణ కొరియా సొంతం అని చెప్పారు.