Spain: స్పెయిన్ లో ఎవరిని బతికించాలి? ఎవరిని వదిలేయాలి?.. డాక్టర్ల నిర్ణయమే ఫైనల్!
- ఆసుపత్రుల్లో వయో వృద్ధులకు దొరకని అడ్మిషన్
- రికవరీ అవుతారన్న నమ్మకముంటేనే ఐసీయూలోకి
- అంత్యక్రియలకు వీల్లేక ఐస్ రింక్ లలో మృతదేహాలు
- స్పెయిన్ లో భీతావహంగా మారిన పరిస్థితి
అది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లోని అతిపెద్ద ఆసుపత్రి. అక్కడి చీఫ్ డాక్టర్లలో ఒకరైన డానియేల్ బెర్నాబ్యూ ఎమర్జెన్సీ రూమ్ లో కూర్చుని ఒక్క క్షణం ఆలోచించి, ఓ డెత్ సర్టిఫికెట్ పై సంతకం పెట్టారు. ఆ వెంటనే, మరో కేసులో తనవంతు సాయం చేసేందుకు వెళ్లిపోయారు. వాస్తవానికి ఆ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ గా లోనికి వచ్చి, ఆసుపత్రిలో అడ్మిట్ కాకుండానే చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీరి మృతదేహాలు వెయిటింగ్ రూమ్ లో పెరుగుతూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లోని శ్మశాన వాటికల్లో స్థలాలు లేక, ఐస్ రింక్ ల్లో మృతదేహాలను స్టోర్ చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల నిబంధనలు కూడా మారిపోయాయి. కరోనా పాజిటివ్ గా సోకి తొలుత వచ్చిన వయో వృద్ధులను పక్కనబెట్టి, రికవరీ చాన్స్ లు అధికంగా ఉండే యువతను తొలుత లోనికి తీసుకెళుతున్నామని బెర్నాబ్యూ వ్యాఖ్యానించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే దేశాన్ని రక్షించుకునేందుకు ఈ చర్య తప్పడం లేదని ఆయన ఒకింత బాధతో తెలిపారు.
"ఆయనో తాతయ్య. మరే విధమైన పరిస్థితి అయినా, ఆయన్ను బతికించేందుకు మొత్తం శ్రమించే వాళ్లం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఆయన వయసువారే అందరూ. అందరూ ఒకేసారి మరణిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
కాగా, స్పెయిన్ లో తాజాగా మరో 738 మంది ప్రాణాలు కోల్పోగా, డెత్ టోల్ 4,089కి పెరిగి, చైనాను అధిగమించింది. అయితే, మరణాల సంఖ్య కాస్తంత తగ్గుముఖం పట్టడమే స్పెయిన్ కు కాస్తంత ఊరటనిచ్చే విషయం. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రధాని పెడ్రో శాంచెజ్ మాట్లాడుతూ, ఇంత విపత్కర పరిస్థితి గతంలో ఎన్నడూ సంభవించలేదని అన్నారు. ప్రస్తుతం వయో వృద్ధులుగా ఉన్న వారు సివిల్ వార్ ను, ఆపై వచ్చిన ఇబ్బందులను చూశారని, ఇప్పటి ప్రజలు ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అంతకు మించిన పోరాటం చేయాల్సి వుందని అన్నారు.