Corona Virus: 'కరోనా' విరాళాల కోసం 'పీఎం కేర్స్ ఫండ్' ఏర్పాటు!
- కరోనాపై పోరుకు, సహాయక చర్యల కోసం విరాళాలు ఇవ్వాలని కోరిన ప్రధాని
- చిన్న మొత్తాలు కూడా ఇవ్వొచ్చని సూచన
- పీఎం కేర్స్ ఫండ్ బ్యాంకు ఖాతా వివరాలు ట్విట్టర్ లో వెల్లడి
దేశవ్యాప్తంగా కరోనా ముప్పు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 'పీఎం కేర్స్ ఫండ్' ఏర్పాటు చేశారు. కరోనాపై పోరుకు, సహాయక చర్యలకు ఉపయోగపడేలా విరాళాలు ఇవ్వదలిచిన వారికి ఇది వేదికగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయులందరూ 'పీఎం కేర్స్ ఫండ్' కు విరివిగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చిన్నమొత్తాలు కూడా విరాళాలుగా అందించవచ్చని మోదీ తెలిపారు.
మున్ముందు కూడా విపత్తులు సంభవించినప్పుడు, అత్యవసర సమయాల్లో ఈ ఫండ్ కొనసాగుతుందని వెల్లడించారు. విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని ఇనుమడింప చేయడమే కాకుండా, ప్రజలను కాపాడే పరిశోధనలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, 'పీఎం కేర్స్ ఫండ్' బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా ప్రధాని మోదీ ట్విట్టర్ లో పంచుకున్నారు.