Telangana: తెలంగాణకు కొత్త సమస్య... కల్లు, మద్యం దొరక్క వింత ప్రవర్తనలు, ఆత్మహత్యలు!
- లాక్ డౌన్ కారణంగా లభించని మద్యం
- ఫినాయిల్ తాగి మహిళ మృతి
- ఫిట్స్ వచ్చి మరణించిన వ్యక్తి
- సమస్యను పరిష్కరించాలంటున్న నిపుణులు
లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్న తెలంగాణ సర్కారు ముందు ఇప్పుడో కొత్త సమస్య వచ్చి పడింది. నిత్యమూ కల్లు, మందుకు అలవాటు పడిన వారు, ఇప్పుడు అవి దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఇందూరులో ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా, తాజాగా, నిజామాబాద్ లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవ్యక్తి ఫిట్స్ వచ్చి మరణించాడు.
నగరంలోని సాయినగర్ కు చెందిన శకుంతల (65)కు నిత్యమూ కల్లు తాగడం అలవాటు. గత వారం రోజులుగా కల్లు అందుబాటులో లేకపోగా, రెండు రోజుల నుంచి పిచ్చిగా ప్రవర్తించిన ఆమె, శుక్రవారం రాత్రి ఇంట్లో అందుబాటులో ఉన్న ఫినాయిల్ తాగేసింది. దీన్ని గమనించిన ఆమె భర్త ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న మరణించింది.
ఇదే సమయంలో మద్యం తాగే అలవాటున్న శంకర్ (45) అనే వ్యక్తి, ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇక్కడి ముదిరాజ్ వీధిలో ఉండే భూషణ్ అనే మరో వ్యక్తి, కల్లు లేక విచిత్రంగా ప్రవర్తిస్తూ, ఫిట్స్ వచ్చి చనిపోయారని పేర్కొన్నారు.
ఇదిలావుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కల్లు గీసుకుని, అమ్ముకోవడానికి తన టూ వీలర్ పై వస్తున్న బాలనర్సాగౌడ్ (72), రోడ్డుపై వేసివున్న చెట్ల కొమ్మలు, మొద్దులను దాటే క్రమంలో ప్రమాదానికి గురై మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
కాగా, తెలంగాణలో విచ్చలవిడిగా లభ్యమయ్యే మద్యానికి బానిసలు అయినవారు లక్షల్లో ఉన్నారు. వీరికి మరికొన్ని రోజులు మద్యం అందుబాటులో లేకుంటే, ఈ తరహా మరణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని సలహా ఇస్తున్నారు.