Corona Virus: 100 కిలోమీటర్లు నడిచి మృతి చెందిన డెలివరీ బాయ్
- లాక్డౌన్ నేపథ్యంలో కాలినడకన ఇంటికి బయలుదేరిన డెలివరీ బాయ్
- దాదాపు 200 కిలోమీటర్లు వెళ్లాలనుకున్న వ్యక్తి
- మధ్యలోనే ఛాతి నొప్పితో కుప్పకూలిన వైనం
- ఢిల్లీ-ఆగ్రా హైవేపై ఘటన
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో వలస కార్మికులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. రోడ్డుపై వాహనాలకు అనుమతి లేకపోవడంతో కాలినడకనే కార్మికులు వందలాది కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. ఈ క్రమంలో 200 కిలోమీటర్ల ప్రయాణం ప్రారంభించిన ఓ డెలివరీ బాయ్ 100 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న రణ్వీర్ సింగ్ (39) లాక్డౌన్ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని మోర్నే జిల్లాలో ఉన్న తన సొంత గ్రామానికి బయలుదేరాడు. ఢిల్లీ, ఆగ్రా హైవేలో కైలాష్ టర్నింగ్ వద్ద అతడికి ఛాతి నొప్పి వచ్చింది. ఆ సమయంలో రణ్వీర్తో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.