Botsa Satyanarayana: నిత్యావసరాల ధరలను దుకాణదారులు బోర్డులో విధిగా ప్రదర్శించాలి: బొత్స
- ధరలు పెంచితే చర్యలు తీసుకుంటామన్న మంత్రి
- వలస కార్మికుల కోసం షెల్టర్ల ఏర్పాటు
- ఉపాధ్యాయులను కూడా రంగంలోకి దింపుతామన్న బొత్స
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, సహాయచర్యలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. వలస కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగుల వసతి కోసం ఎక్కడికక్కడ కల్యాణమండపాలు, ఇతర షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని, రోజూ ఒకే తరహా భోజనం కాకుండా, విభిన్నరకాల ఆహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు.
నిత్యావసరాల ధరలు పెంచకుండా, వాటి ధరల వివరాలను ప్రతి దుకాణం ఎదుట బోర్డులో ప్రదర్శించాలని స్పష్టం చేశారు. అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలోని ఉపాధ్యాయులను కూడా ఈ విపత్తు నిర్వహణలో భాగం చేయాలని నిర్ణయించుకున్నామని, రేపు మున్సిపల్ పరిధిలోని ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతానని తెలిపారు. ఉపాధ్యాయులపైనా సామాజిక బాధ్యత ఉందన్నారు.