KCR: రైతులెవరూ మార్కెట్ యార్డుకు రావొద్దు... అధికారులే గ్రామాలకు వస్తారు: సీఎం కేసీఆర్
- మార్కెట్ యార్డులన్నీ మూసివేశామన్న సీఎం కేసీఆర్
- ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందని వెల్లడి
- రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని హామీ
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి కరోనా నేపథ్యంలో వ్యవసాయ పంటల కొనుగోళ్ల అంశంపై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయని, వాటి కొనుగోలు బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని వెల్లడించారు. కరోనాపై లాక్ డౌన్ అమల్లో ఉన్నందున రైతులెవరూ మార్కెట్ యార్డులకు రావొద్దని, మార్కెట్ యార్డులను మూసివేశామని తెలిపారు. అధికారులే గ్రామాలకు వచ్చి రైతుల నుంచి గిట్టుబాటు ధర ఇచ్చి పంటలు కొంటారని వివరించారు.
వరి, మొక్కజొన్న పంటలు పెద్ద ఎత్తున చేతికొస్తున్నాయని, ఒక్క గింజ కూడా రైతులు బయట అమ్ముకోవాల్సిన అవసరంలేదని, పైగా బయట గిట్టుబాటు ధరల్లేవని అన్నారు. దీనికి సంబంధించి రూ.3,200 కోట్ల పైచిలుకు మొత్తం మార్క్ ఫెడ్ కు గ్యారంటీ మనీగా చెల్లించామని వెల్లడించారు. రైతులకు కూపన్లు ఇస్తారని, అందులో పేర్కొన్న సమయంలో రైతు తన పంటను అమ్ముకోవచ్చని సూచించారు. కరోనా ప్రబలే అవకాశం ఉన్నందున ఈ ఏర్పాటు చేశామని వివరించారు.