Tirumala: లాక్ డౌన్ లేకుంటేనే 14 తరువాత భక్తులకు శ్రీవారి దర్శనం: టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్
- లాక్ డౌన్ కొనసాగితే దర్శనాలు ఉండవు
- సేవలన్నీ ఏకాంతంగానే
- టికెట్లు బుక్ చేసుకున్నవారి డబ్బు వాపస్
లాక్ డౌన్ కొనసాగినంత కాలం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శనాలకు భక్తులను అనుమతించే అవకాశం లేదని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఏప్రిల్ 14 వరకూ దర్శనాలను నిలిపివేశామని, ఆ తరువాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపారు.
స్వామివారి సేవలన్నీ ఏకాంతంగానే జరుగుతున్నాయని, శ్రీరామనవమి, పట్టాభిషేకం కూడా ఏకాంతంగానే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. రూ. 300 ప్రత్యేక దర్శనాలు, సేవా టికెట్లను బుక్ చేసుకున్న వారు వాటిని పోస్ట్ పోన్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని, ఒకవేళ వారు టికెట్లను రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్ చేస్తామని ఆయన తెలిపారు. కరోనా కారణంగా పనిలేక, ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న వారి కోసం నిరంతరాయంగా ఆహార పొట్లాలను అందిస్తామని సింఘాల్ స్పష్టం చేశారు.