Liquor: ఓ మందుబాబు బాధ... సైబర్ నేరగాళ్లకు వరమైంది!
- ముంబైలోని చెంబూరు ప్రాంతంలో ఘటన
- మద్యం కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేసిన బాధితుడు
- అదే అదనుగా లక్ష రూపాయలకు పైగా లాగేసిన నేరగాళ్లు
కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ విధించడంతో, పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు మూతబడగా, నిత్యమూ మందు కొట్టేందుకు అలవాటు పడిన వారెందరో విలవిల్లాడుతున్నారు. నిత్యావసరాలు మినహా మరేమీ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో మందు బాబులు గిలగిల్లాడుతుండగా, అదిప్పుడు సైబర్ నేరగాళ్లకు వరమైంది. ప్రజలను ఆన్ లైన్ ద్వారా మోసం చేసేందుకు సైబర్ నేరస్తులకు మద్యం షాపుల మూసివేత బాగానే కలిసొచ్చింది.
ముంబైలో జరిగిన ఈ ఘటనే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే, మద్యం కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్న చెంబూరు ప్రాంతానికి చెందిన దంపతులకు మార్చి 24న ఓ ఫోన్ నంబర్ దొరికింది. ఆ నంబర్ కు ఫోన్ చేసి, మద్యాన్ని డోర్ డెలివరీ చేయాలని వారు కోరగా, రూ. 3 వేలు ఖర్చవుతుందని తెలిపారు. బాధితుడు చెల్లిస్తానని చెప్పగా, ఓ ఓటీపీ వస్తుందని, దాన్ని తెలియజేయాలని కోరారు. అతని మాటలను నమ్మిన దంపతులు, తమ మొబైల్ కు వచ్చిన ఓటీపీని చెప్పగా, బ్యాంకు ఖాతా నుంచి రూ. 30 వేలను గుంజేశారు.
విషయాన్ని గమనించిన బాధితుడు, అదే నంబర్ కు ఫోన్ చేయగా, పొరపాటున కట్ అయ్యాయని, వెంటనే వాపస్ చేస్తున్నామని, మరో ఓటీపీ వస్తుందని, దాన్ని తెలియజేయాలని సూచించారు. ఇలా పలుమార్లు వారిని మోసం చేస్తూ, రూ. 1.03 లక్షలు లాగారు. ఆపై తమ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని, మద్యాన్ని పంపించలేమని, మరో కార్డుతో చెల్లింపులు చేయాలని సూచించారు. దీంతో తాము దారుణంగా మోసపోయామని భావించి, తిలక్ నగర్ పోలీసులను ఆశ్రయించారా దంపతులు.