India: కరోనా మరణాల రేటు అమెరికాలో కన్నా ఇండియాలోనే అధికం!
- యూఎస్ మరణాల రేటు 1.74 శాతమే
- ఇండియాలో కేసులు తక్కువే అయినా మృతులు 2.7 శాతం
- ప్రజల్లో చైతన్యంతోనే పరిస్థితి మారుతుందంటున్న నిపుణులు
కరోనా వ్యాధితో మరణించిన వారి రేటు అమెరికాతో పోలిస్తే, ఇండియాలో అధికంగా ఉంది. ఇండియాలో కేసుల సంఖ్య అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే, చాలా తక్కువగా ఉన్నా, మరణాలు మాత్రం అధికంగా నమోదవుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యూఎస్ లో మరణాల రేటు 1.74 శాతం కాగా, ఇండియాలో ఇది 2.70 శాతంగా ఉంది. ప్రపంచ సగటు 4.69తో పోలిస్తే, ఇది తక్కువే అయినా, కరోనా సోకిన చాలా దేశాలతో పోలిస్తే మాత్రం అధికమే.
యూరప్ లోని పలు దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తుండగా, మృతుల రేటు 4 నుంచి 11 శాతం వరకూ ఉంది. జర్మనీ మాత్రం ఇందుకు మినహాయింపు. కేసుల సంఖ్య భారీగా ఉన్న దేశంలో మరణాల రేటు కేవలం 0.8 శాతమే. ఇక ఇండియా విషయానికి వస్తే, ఇప్పటివరకూ 35 వేల మందికి పరీక్షలు జరుపగా, అందులో 2.92 శాతంగా అంటే, 1,024 మందికి (సోమవారం ఉదయానికి) వ్యాధి సోకింది.
కరోనా వ్యాప్తి ఇండియాలో తక్కువగా ఉండటానికి లాక్ డౌన్ తో పాటు, ప్రజల్లో చైతన్యం పెరగడమే కారణమని అంటున్న భారత వైద్య పరిశోధనా మండలి నిర్వాహకులు, ఈ విషయంలో ఎయిడ్స్ వ్యాధిని ఉదాహరణగా చెబుతున్నారు. 1990 దశకం ప్రారంభమయ్యే సమయానికి ఎయిడ్స్ వ్యాపిస్తున్న తీరును బట్టి, 2000 నాటికి ఎయిడ్స్ బాధితుల సంఖ్య 4 కోట్లకు చేరుతుందని అంచనా వేశామని, కానీ, ప్రజల్లో పెరిగిన అవగాహనతో ఆ సంఖ్య ఇప్పటికీ 24 లక్షలకు మించలేదని గుర్తు చేశారు.
ఇక సాంక్రమిక వ్యాధుల వ్యాప్తి ఎంత వేగంతో ఉంటుందన్నది ప్రజల్లో పెరిగే చైతన్యంపై ఆధారపడి వుంటుందని, కరోనా విషయంలో సోషల్ డిస్టెన్స్ అవలంబించడమే అత్యంత కీలకమని నిపుణులు సలహా ఇస్తున్నారు.