Johnson and Johnson: కరోనా వ్యాక్సిన్ కోసం చేయి కలిపిన అమెరికా ప్రభుత్వం, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ

Johnson and Johnson to make corona vaccine in collaboration with US

  • వ్యాక్సిన్ కోసం 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి 
  • 421 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ముందుకొచ్చిన అమెరికా
  • వచ్చే ఏడాది కల్లా వ్యాక్సిన్ సిద్ధం చేసేందుకు ఉరుకులు పరుగులు

అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యల దిశగా దృష్టి సారించింది. ఈ క్రమంలో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థతో కలిసి వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకుంది. దీనిపై జాన్సన్ అండ్ జాన్సన్ వర్గాలు వివరాలు వెల్లడించాయి.

100 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేసేందుకు అమెరికా ప్రభుత్వంతో కలిసి ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,536 కోట్లు) మేర పెట్టుబడి పెడుతున్నట్టు తెలిపాయి. ఈ క్రమంలో అమెరికా సర్కారు 421 మిలియన్ డాలర్ల పెట్టుబడి అందించనుండగా, ఆ నిధులు అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ నిర్మించబోయే భారీ కరోనా వ్యాక్సిన్ తయారీ కేంద్రానికి వెచ్చించనున్నారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కోనే వ్యాక్సిన్ తయారీలో సొంతగా రూపొందించిన ఫార్ములాను అభివృద్ధి చేస్తామని, సెప్టెంబరు నాటికి మానవులపై పరీక్షిస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ వర్గాలు వెల్లడించాయి. 2021 సంవత్సరం ప్రథమార్థం నాటికి దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు అనుమతుల కోసం ప్రయత్నిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణంగా ఓ వ్యాక్సిన్ తయారీ, ప్రయోగదశలు అన్నీ పూర్తయ్యేసరికి 18 నెలల కాలం పడుతుంది. అయితే కరోనా వ్యాక్సిన్ ను అంతకంటే ముందే తీసుకురావడానికి జాన్సన్ అండ్ జాన్సన్ యుద్ధప్రాతిపదికన కృషి చేయాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News