Supreme Court: వలసదారుల్లో ధైర్యాన్ని నింపేందుకు కేంద్రానికి కీలక సూచనలు చేసిన సుప్రీంకోర్టు
- షెల్టర్ హోమ్స్ లోని అందరి బాధ్యతా ప్రభుత్వానిదే
- వారికి నిష్ణాతులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి
- చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే వ్యాఖ్యలు
లాక్ డౌన్ కారణంగా ఉపాధిని కోల్పోయిన వేలాది మంది తమతమ స్వస్థలాలకు బయలుదేరిన వేళ, వారందరినీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిలువరించిన సంగతి తెలిసిందే. ఎవరూ ఎక్కడికీ వెళ్లవద్దని ఆదేశిస్తూ, వారిని షెల్టర్ హోమ్స్ కు తరలించిన నేపథ్యంలో, వారి బాగోగులపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ, సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది.
"మీరు షెల్టర్ హోమ్స్ కు తరలించిన ప్రతి ఒక్కరి బాధ్యతా మీదే. వారందరికీ పౌష్టికాహారం, వైద్య సదుపాయాలను సమకూర్చాలి" అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం వలసదారుల్లో చాలా భయాందోళనలు నెలకొని వున్నాయని, 21 రోజుల లాక్ డౌన్ కారణంగా వారంతా తమ ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారని వ్యాఖ్యానించిన సీజే, "వారిలోని భయాందోళనలు వైరస్ కన్నా ప్రమాదం. నిపుణులైన కౌన్సెలర్లతో వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలి. వారంతా భజనలు, కీర్తనలు పాడుకోవచ్చు. నమాజ్ చేసుకోవచ్చు. వారికి మనోధైర్యాన్ని కలిగించే పనులను చేసుకోనివ్వండి. అయితే, ఒక్కొక్కరి మధ్యా భౌతిక దూరం తప్పనిసరి. వారివారి నమ్మకాలకు అనుగుణంగా షెల్టర్ హోమ్స్ లో వారికి ఆశ్రయం కల్పించాలి. తరచూ కమ్యూనిటీ లీడర్లు షెల్టర్ హోమ్స్ ను సందర్శిస్తూ, అక్కడున్న వారికి ధైర్యం చెప్పాలి" అని సూచించారు.
అంతకుముందు తుషార్ మెహతా తన వాదన వినిపిస్తూ, మంగళవారం ఉదయానికి వీధుల్లో వలసదారులు ఎవరూ లేరని, అందరినీ షెల్టర్ హోమ్స్ కు చేర్చామని తెలిపారు. మరో 24 గంటల వ్యవధిలో నిష్ణాతులైన కౌన్సెలర్లను, మతాధికారులను వారి వద్దకు పంపిస్తామని వెల్లడించారు. వారిలో ధైర్యాన్ని నింపేందుకు పాస్టర్లు, మౌల్సీలు, సాధువులను పంపనున్నట్టు పేర్కొన్నారు.