Chandrababu: ఒకస్థాయి దాటితే మన దేశంలో వైద్యం అందించలేం... ఇప్పుడే జాగ్రత్తపడాలి: చంద్రబాబు

Chandrababu warns governments on corona spreading

  • అధిక జనాభా కలిగిన దేశంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న చంద్రబాబు
  • 49 రోజుల లాక్ డౌన్ అవసరమని సూచన
  • వలంటీర్లను సమర్థంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి సూచన

కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఒక స్థాయి దాటితే అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో వైద్యం అందించలేమని స్పష్టం చేశారు. చైనాలోని వుహాన్ నగరంలో కరోనా కారణంగా 62 రోజుల పాటు లాక్ డౌన్ విధించారని, భారత్ లో 49 రోజుల లాక్ డౌన్ అవసరమని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనాను రూపుమాపాలని సూచించారు.

అయితే అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణంలో తేమ ఉండే దేశాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని తెలిపారు. అయితే అలాంటి దేశాల్లోనూ కరోనా ఉనికి ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోనూ కరోనా తీవ్రంగానే ఉందని, ఒక్కరోజులో 17 కేసులు నమోదు కావడం అందుకు నిదర్శనమని చెప్పారు. హృదయ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్లు కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అలాంటి వారిలో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు.

ఈ వైరస్ సామాన్యులనే కాదు వైద్యులను కూడా కబళిస్తుండడం ఆందోళనకరమని అన్నారు. వైద్యులు, ఇతర సిబ్బందికి తగిన రక్షణ కవచాలు అందించాలని, రాష్ట్రంలో రక్షణ కవచాల కొరత ఉందని తెలిపారు. రేషన్ దుకాణాలు తెరవడం వల్ల అందరూ రోడ్లపైకి వచ్చారని, కానీ భౌతికదూరం పాటించాల్సిన పరిస్థితుల్లో ఇలా గుమికూడడం మంచిది కాదని హితవు పలికారు. వలంటీర్ల వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందన్న కారణంతో పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతిన్నదని, రొయ్యలన్నీ చెరువుల్లోనే ఉన్నాయని, కొనే నాథుడే లేడని అన్నారు. ప్రభుత్వమే రొయ్యల రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హార్టీకల్చర్ రంగం కూడా కుదేలైందని, పంటలన్నీ పొలాల్లోనే ఉండిపోయాయని, కూలీలు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వలసదారులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలని కోరుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.

లాక్ డౌన్ కారణంగా కొందరు ఇళ్లలో అదేపనిగా ఆలోచిస్తున్నారని, కరోనా వస్తే చనిపోతారని భయపడుతున్నారని వివరించారు. అయితే కరోనా సోకినవాళ్లందరూ చనిపోరని, వయసు పైబడినవాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లకే ఈ వైరస్ ప్రమాదకరం అని చెప్పారు.

  • Loading...

More Telugu News