India: భారత్ లో కరోనా మరింత తీవ్రం... 24 గంటల్లో 227 పాజిటివ్ కేసులు

Corona virus causes more deaths in India

  • దేశంలో ఇప్పటివరకు 32 మరణాలు
  • విదేశాల నుంచి వైద్యపరికరాలు తెప్పిస్తున్న కేంద్రం
  • ఎయిమ్స్ తో కలిసి ప్రత్యేక వైద్యబృందాల ఏర్పాటు

భారత్ లో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 32 మంది మరణించారు. గడచిన కొన్నిరోజులుగా భారత్ లో మరణాల రేటు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 227 కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మాస్కులు, శానిటైజర్లు, వైద్యపరికరాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. దక్షిణ కొరియా, వియత్నాం, టర్కీ నుంచి వైద్య పరికరాలు రప్పిస్తున్నామని కేంద్రం వెల్లడించింది. కరోనా బాధితులతో కలిసి ఉన్నవారి వివరాలు వేగంగా సేకరిస్తున్నామని, ఈ విషయంలో రాష్ట్రాలు బాగా సహకరిస్తున్నాయని వివరించింది.

కరోనా చికిత్సలో భాగంగా 15 వేల మంది నర్సులకు ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తున్నామని, కరోనా చికిత్సకు ఎయిమ్స్ తో కలిసి వైద్యబృందాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. దేశం మొత్తమ్మీద కరోనా నిర్ధారణకు 123 పరీక్ష కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఇప్పటివరకు 43 వేల మందికి పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అటు, కేంద్ర హోంశాఖ స్పందిస్తూ, వలస కూలీల కోసం 21 వేల సహాయ శిబిరాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 6.66 లక్షల మందికి వసతి ఏర్పాటు చేశామని, 23 లక్షల మంది కూలీలకు ఆహారం అందించామని వివరించింది. వలస కూలీల సమస్య ప్రస్తుతం అదుపులోనే ఉందని పేర్కొంది.

  • Loading...

More Telugu News