Hyderabad: చంపేసి 'సీన్' క్రియేట్ చేశాడు...తంగడపల్లిలో మహిళ హత్య కేసులో ప్రియుడే హంతకుడు!

tangadapalli women murder case traced

  • కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు 
  • పోలీసుల అదుపులో నిందితుడు 
  • మృతురాలిది సిక్కిం రాష్ట్రం అని నిర్ధారణ

ఆమెకు పెళ్లయింది. పిల్లలు ఉన్నారు. నిందితుడు ఫేస్‌బుక్‌ ద్వారా ఆమెను ట్రాప్ చేశాడు. అదే వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. తర్వాత ఏమైందో ఏమో ఆమెను చంపేసి శవాన్ని నగరానికి దూరంగా ఉన్న తంగడపల్లి ఫ్లైఓవర్ పైనుంచి పడేశాడు. అత్యాచారం చేసి చంపేసినట్లు సీన్ క్రియేట్ చేసి చక్కగా జారుకున్నాడు. కానీ పాపం పండి పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన తంగడపల్లిలో మహిళ హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.

పోలీసుల కథనం మేరకు...రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి ఫ్లైఓవర్ కింద 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న యువతి మృతదేహాన్ని మార్చి 17న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. పచ్చని చీరకట్టుకుని ఉన్న ఈ మహిళపై ఎవరో దారుణంగా అత్యాచారం చేసి అనంతరం బండరాయితో తలపై మోది చంపేశారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

తాజాగా ప్రియుడే ఆమెను చంపేసి అత్యాచారం, హత్య జరిగినట్లు సీన్ క్రియేట్ చేశాడని నిర్ధారించారు. సిక్కింకు చెందిన మృతురాలికి పెళ్లయి భర్త, పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో నిందితుడితో ఈమెకు పరిచయం అయ్యింది. అది ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఘటనకు ముందు నిందితుడు తెలివిగా ఆమెను హైదరాబాద్ రప్పించాడు. ఈ మహిళ అదృశ్యమైనట్టు  సిక్కింలో కేసు కూడా నమోదైంది.

ఇక ఆమె నగరానికి వచ్చిన రోజునే ఉద్దేశపూర్వకంగానే ఆమెను నిందితుడు (25) హత్య చేశాడు. ఈ విషయంలో ఇతనికి బంధువు ఒకడు సాయం చేశాడు. అనంతరం మృతదేహాన్ని నగర శివారుల్లో పారేసేందుకు కారును అద్దెకు తీసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తంగడపల్లి ఫ్లైఓవర్ వంతెన పైకి చేరుకున్నారు.

మృతదేహానికి నైలాన్ తాళ్లుకట్టి వంతెన కిందకు దించేశారు. ఆమెపై ఎవరో అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులను తప్పుదోవ పట్టించే క్రమంలో ఆమె ఒంటిపై దుస్తులు తీసేసి పచ్చని చీర ఒకటి పడేశారు. అలాగే ఆమె ఒంటిపై నగలు అలాగే వదిలేశారు. ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు నిందితులు ఊహించినట్టుగానే తొలుత అత్యాచారం, హత్యగానే భావించారు.

కానీ సీసీ పుటేజీ, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అద్దె కారును ముందు గుర్తించారు. కారు అద్దెకు తీసుకున్న కేంద్రంలో సమర్పించిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ప్రధాన నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించడంతో తన బంధువైన మరో వ్యక్తితో కలిసి చేసిన దారుణాన్ని వెల్లడించాడు. దీంతో రెండో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News